సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
కృష్ణదేవిపేట ఎస్సై "వై.తారకేశ్వరరావు"
RTV NEWS( లవకుశ)సైబర్ నేరాలపై ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని కృష్ణదేవిపేట ఎస్సై వై.తారకేశ్వరరావు అన్నారు. ఆదివారం రాత్రి గొలుగొండ మండలం లింగంపేట గ్రామంలో గ్రామస్తులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై తారకేశ్వరరావు మాట్లాడుతూ
మోసపూరిత కాల్స్, మెసేజ్‌లతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. సామాజిక మాధ్యమాలు, ఫోన్లు, వాట్సాప్‌లో ప్రభుత్వ అధికారులు, పోలీసులు, సీబీఐ, కస్టమ్స్, బ్యాంకులు, విద్యుత్ శాఖ, భీమా సంస్థలు, కేవైసీ పేరుతో వస్తున్న కాల్స్, మెసేజ్‌లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఇటువంటి కాల్స్ లిప్ట్ చేయవద్దని, వాట్సాప్‌లో వచ్చిన లింకులను క్లిక్ చేయవద్దని ఎస్ఐ సూచించారు.
గ్రామాల్లో దొంగతనాలపై జాగ్రత్తగా ఉండాలన్నారు. కొత్త వ్యక్తులు సంచరిస్తే తమకు వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. యువత చెడు వ్యసనాల బారిన పడకుండా ఖాళీ సమయంలో ఆటలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించాలని సూచించారు. గ్రామాల్లో చిన్న చిన్న తగాదాలు సంభవిస్తే పెద్దల సమక్షంలో మాట్లాడుకుని సరిదిద్దుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంతోష్ కుమార్, మాజీ సర్పంచ్ పరవాడ అప్పలనాయుడు, జనసేన మండల ప్రధాన కార్యదర్శి సాలాదులు ప్రసాద్ బాబు, డీలర్ స్వామి నాయుడు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సలాదుల దేవి, మరిసా దేవుడు, మద్దపు కాము నాయుడుగ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.